ఓ మహిళ బ్రాలో దాక్కున్న బల్లి అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా బార్బడోస్ నుంచి బ్రిటన్‌లోని యార్క్‌షైర్ వరకు విమానంలో వచ్చేసింది.

ఈ చిన్న బల్లిని బార్బీ అని పిలుస్తున్నారు. సౌత్ యార్క్‌షైర్‌లో తన ఇంటికి చేరుకున్న అనంతరం, సూట్‌కేస్‌లోని బట్టలను బయటకు తీస్తుండగా లీసా రషెల్ దీన్ని చూశారు. ”అది అటూఇటూ కదలడం చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచాను. 4,000 మైళ్ల(సుమారు 6,500 కిలోమీటర్లు) ప్రయాణం తర్వాత, బ్రాలో ఇలాంటి జీవి ఉంటుందని ఎవరు అనుకుంటారు” ప్రస్తుతం బార్బీ.. రాయల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ (ఆర్ఎస్‌పీసీఏ) సంరక్షణలో ఉంది.

కరీబియన్ దీవిలో విహారయాత్రకు వెళ్లివచ్చిన అనంతరం, మంగళవారం ఇంటిలో తన బట్టలను లీసా ఒక్కొక్కటిగా బయటకు తీశారు. ”మొదట బ్రాపై దీన్ని చూసినప్పుడు, ఏదో మరక పడిందని అనుకున్నాను. బ్రాను గట్టిగా ఊపగానే అది కిందపడి కదిలింది. దీంతో అది బల్లి అని అర్థమైంది.” ”ఆ బల్లి నిజంగా అదృష్టవంతురాలు. ఎందుకంటే అది సూట్‌కేస్‌లో పైనే ఉన్నప్పటికీ, బయట వేడిగా ఉందని నేను బ్రా వేసుకోలేదు. లేకపోయుంటే..”అని లీసా అన్నారు. ”యార్క్‌షైర్‌కు వచ్చేటప్పుడు సూట్‌కేస్‌లో బట్టలను కుక్కేందుకు నేను దానిపై కూర్చున్నాను. అయితే, అదృష్టవశాత్తు సూట్‌కేసులోని బల్లికి ఏమీకాలేదు.”

బార్బీ బొమ్మ పేరు మీదే ఈ బల్లికి ఆ పేరు పెట్టారు. 24 గంటలపాటు ఇది సూట్‌కేస్‌లో అలానే ఉండిపోయింది.” ఈ చిన్న బల్లిని తీసుకెళ్లేందుకు లీసా ఇంటికి ఆర్‌ఎస్‌పీసీఏ ఇన్‌స్పెక్టర్ వచ్చారు. ”ఈ బల్లిని ఇలా తీసుకురాకూడదు. ఎందుకంటే ఇది ఇక్కడి జీవి కాదు. ఇక్కడ వాతావరణంలో ఇది మనుగడ సాగించలేదు”అని ఆర్‌ఎస్‌పీసీఏకు చెందిన శాండ్రా డ్రాన్స్‌ఫీల్డ్ అన్నారు. ప్రస్తుతం ఈ బల్లి నిపుణుల పర్యవేక్షణలో ఉంది. దాని ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి