విశాఖ ఏజెన్సీలో అనుమతులు లేని చోట లేటరైట్‌ తవ్వకాలు చేస్తున్నారని, పర్యావరణానికి హాని చేస్తున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు ఫిర్యాదులు అందాయి.

దాంతో లేటరైట్ తవ్వకాలు జరుగుతున్న నాతవరం మండలం బమిడికలొద్ది గ్రామంలో ఎన్జీటీ బృందం బుధవారం పర్యటించింది. ఈ బృందంలో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎల్లమురుగన్‌, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, డీఎఫ్‌వో అనంతశంకర్‌, గనుల శాఖ డీడీ, కాలుష్య నియంత్రణ మండలి విశాఖ ఈఈ ఉన్నారు.

స్థానిక ప్రజా, గిరిజన సంఘాలు లేటరైట్ తవ్వకాలు ఆపాలంటూ ఎన్జీటీ బృందానికి వినతి పత్రాలు సమర్పించాయి. “బమిడికలొద్దిలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు అందిన ఫిర్యాదు మేరకు ఇక్కడికి వచ్చాం. సరిహద్దులో నిర్మించిన రోడ్డు, నరికేసిన చెట్లను పరిశీలించాం. అలాగే మైనింగ్ జరిగిన, జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించాం. కేవలం మైనింగే కాకుండా, పర్యావరణ, అటవీ చట్టాల ఉల్లంఘన తదితర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. దీనిపై నివేదిక తయారు చేసి, ప్రభుత్వానికి సమర్పిస్తాం” అని ఎన్జీటీ బృంద సభ్యులు, విశాఖ జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున తెలిపారు.

విశాఖ, తూర్పు గోదావరి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ ఖనిజం విస్తారంగా ఉంది. గతంలో దీని తవ్వకాల కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ, గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బాక్సైట్ తవ్వకాల నిమిత్తం కంపెనీలకు ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి. అయినప్పటికీ బాక్సైట్ తవ్వకాల కోసం మాత్రం తెరవెనుక ప్రయత్నాలు ఆగడం లేదని గిరిజన సంఘం నాయకులు అంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు లేటరైట్ తవ్వకాలు తెరమీదకు వచ్చాయిని చెప్తున్నారు. “జిల్లాలోని మాకవరపాలెంలో యూఏఈకి చెందిన అన్ రాక్ కంపెనీ అల్యూమినియం శుద్ధి కర్మాగారాన్ని నిర్మించింది. దీనికి బాక్సైటే ముడిఖనిజం. బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ఆ సమయంలోనే ఈ కంపెనీ రూ. 720 కోట్లతో ఈ ఫ్యాక్టరీని నిర్మించింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి