ఆ ఊళ్లో ఇప్పటి వరకు నాలుగు ఆలయాలు, మూడు పాఠశాలలు, రెండు ట్రావెలర్స్ బంగ్లాలు సముద్రంలో కలిసి పోయాయి. ఈ మధ్య విడుదలైన ‘ఉప్పెన’ సినిమాలో సముద్రపు ఒడ్డున ఓ గుడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడా గుడి కూడా లేదు.

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో సముద్రం ఒడ్డున నివసిస్తున్న వారిని ప్రాణభయం నిత్యం వెంటాడుతోంది. అందమైన జాంధానీ చీరలకు, చేనేత వృత్తి నైపుణ్యానికి నిలయంగా ఉండే ఊరు ఉప్పాడ. కానీ సముద్రపు అలల తాకిడితో ఈ గ్రామం అల్లాడిపోతోంది. గడిచిన రెండు దశాబ్దాల్లోనే వందల ఇళ్లు సముద్రగర్భంలో కలిసిపోయాయి. సముద్రం చొచ్చుకు వస్తున్న కొద్దీ తాము వెనక్కి జరగడమే తప్ప మరో దారి లేకపోవడంతో మత్స్యకారులంతా ఆందోళనలో ఉన్నారు. దశాబ్ధిన్నర కిందట, కోత నివారణ కోసం నిర్మించిన జియో ట్యూబ్ కూడా ధ్వంసం కావడంతో ముప్పు మరింత పెరిగిందనే అభిప్రాయం బాధితుల నుంచి వస్తోంది. ప్రభుత్వం మాత్రం ఈ ప్రమాదం నివారించేందుకు మార్గాన్వేషణలో ఉన్నట్టు చెబుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉప్పాడ గ్రామం ఉంటుంది. మత్స్యకార, చేనేత వృత్తిదారులు అత్యధికంగా జీవిస్తున్నారు. బంగాళాఖాతం తీర ప్రాంత గ్రామమైన ఉప్పాడ ఓ మేజర్ పంచాయితీ. 2011 జనాభా లెక్కల ప్రకారమే 12వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు. 3,190 ఇళ్లుండేవి. రెవెన్యూ రికార్డుల ప్రకారం 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికే 40 హెక్టార్లకు పైగా భూమి సముద్రంలో కలిసి పోయిందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. నిత్యం తీరంలో నివసించే వారికి సముద్రపు అలల తీవ్రత పెద్ద సమస్యగా మారుతోంది. రానురాను సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండడంతో ఇప్పటికే వందల ఇళ్లు కూలిపోయాయి. సముద్రపు కోతకు గురై 20 ఏళ్ల కిందట రామాలయం కూలిపోగా, మళ్లీ కొంత దూరంలో నిర్మించారు. ఇప్పుడు అది కూడా కూలిపోయింది. ముందుకు వస్తున్న సముద్రపు అలల కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు కోల్పోయిన వారు అవస్థలు పడుతున్నారు.

పెద్ద పెద్ద కెరటాలు వచ్చి ఇంటిని తాకుతుండడం, పెద్ద పెద్ద శబ్దాలు రావడం అక్కడున్న వారికి నిత్యానుభవంగా మారింది. అవి ఎప్పుడు తమ ఇంటిని కూలగొడతాయోనని స్థానికులు భయపడుతుంటారు. ”అమావాస్య, పౌర్ణమి సమయాల్లో అలలు వచ్చి గోడను కొడుతుంటే పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. కానీ ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లాలంటే రూ.3,4 వేలు అద్దె కట్టాలి. అంతశక్తి లేక ఈ ఇంట్లోనే ఉంటున్నాం” అని అక్కడ నివసిస్తున్న మైలపు ఆదెమ్మ బీబీసీతో అన్నారు.

దాదాపు పదేళ్ల నుంచి ఇలాంటి సమస్య ఎదురవుతుండగా, నాలుగైదేళ్లుగా బాగా పెరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ”కెరటాలు ఇంట్లోకి కూడా వస్తే ఖాళీ చేసి బడిలోకి వెళ్లిపోతాం. మళ్లీ తెల్లారిన తర్వాత వచ్చి అన్నీ శుభ్రం చేసుకుంటాం. సముద్రానికి, మా ఇంటికి మధ్య నాలుగు ఇళ్లుండేవి. అవన్నీ కూలిపోయి ఇప్పుడు మా ఇంటి దాక వచ్చేసింది” అన్నారు ఆదెమ్మ. ఆదెమ్మ భర్త వెంకట రమణ రోజూ సముద్రంలో వేటకి వెళతారు. వేట బాగా పడితే రోజుకి వెయ్యి రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. రోజుకి వంద, లేదా అసలు సంపాదన లేక ఖాళీగా వెనక్కి వచ్చే రోజులు కూడా ఉంటాయని ఆమె చెబుతున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి