Home అవర్గీకృతం కరోనావైరస్: ఏడాదికి పైగా స్కూళ్లకు దూరమై చదవడం, రాయడం మర్చిపోయిన పిల్లల పరిస్థితి ఏంటి? –...

కరోనావైరస్: ఏడాదికి పైగా స్కూళ్లకు దూరమై చదవడం, రాయడం మర్చిపోయిన పిల్లల పరిస్థితి ఏంటి? – sandesam.com

13
0

రాధికా కుమారి బలపాన్ని ఎంత గట్టిగా పట్టుకుందంటే తనకొచ్చినవన్నీ పలక మీద చకచకా రాసేస్తుందేమో అనిపించింది. కానీ, వేళ్ల సందుల్లోంచి బలపమూ జారిపోయింది, బుర్రలోంచి అక్షరాలూ జారిపోయాయి.

నిజానికి పదేళ్ల రాధికకు అ,ఆలు రాయడం అంత కష్టం కాకూడదు. కానీ, దాదాపు 17 నెలల పాటూ బడి మొహం చూడని ఆ అమ్మాయి అన్నీ మర్చిపోయింది. ఆన్‌లైన్ చదువులూ లేవు. కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన దగ్గర నుంచి అనేకచోట్ల పాఠశాలలు మూతబడ్డాయి. ప్రైవేటు స్కూళ్లు కొన్ని నెలల్లోనే ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభించాయిగానీ, ప్రభుత్వ పాఠాశాలలకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, ల్యాప్‌టాపులు లేని విద్యార్థులు ఏకంగా చదువులకే దూరమయ్యారు.

జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఓ దళిత గిరిజన గ్రామం డుంబిలో నివసిస్తున్న రాధిక పరిస్థితి కూడా ఇదే. గత మార్చి నుంచి రాధిక చదువుకుంటున్న బడి మూతపడింది. ఆమె చదువుకు దూరం అయింది. డుంబి గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ స్థాయిల్లో దూరదర్శన్ ద్వారా, ఇతర టీవీ కార్యక్రమాల ద్వారా విద్యాబోధన ప్రారంభించాయి. కానీ, ఆ ఊర్లో చాలామంది ఇళ్లల్లో టీవీ కూడా లేదు.

కరోనా కారణంగా చదువుకు దూరమైన పిల్లల పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా, ప్రముఖ ఆర్థికవేత్త జా డ్రెజ్ డుంబి గ్రామానికి చెందిన 36 మంది పిల్లలను ఇంటర్వ్యూ చేశారు. వారిపై ఒక సర్వే జరిపారు. పిల్లల చదువు విషయమై పాఠశాలల నుంచి అందిన సహాయం, టీచర్లు పిల్లల ఇంటికి వెళ్లి చేసిన సహాయం, ఆన్‌లైన్ క్లాసులు, ప్రయివేటు ట్యూషన్లు, తల్లిదండ్రుల అక్షరాస్యత రేటు మొదలైన విషయాలన్నిటినీ ఈ సర్వేలో సేకరించారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 36 మంది పిల్లల్లో 30 మంది ఒక్క అక్షరం కూడా చదవలేకపోవడం, రాయలేకపోవడం చాలా దిగ్భ్రాంతిని కలిగించిందని డ్రెజ్ అన్నారు. ఎక్కువగా ప్రయిమరీ స్కూలు పిల్లల్లే చదవడం, రాయడంలో వెనుకబడి ఉన్నారని, గత ఏడాదిన్నర కాలంగా వీరికి చదువు విషయమై దాదాపు ఏ సహాయమూ అందలేదని ఆయన వివరించారు.