భారత దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్త్రీ తన తొలిబిడ్డను పొందే వయసు పెరుగుతోంది.

మహిళలు విద్య, కెరీర్ పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అన్ని విధాలా స్థిరపడిన తర్వాతే వివాహం, పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మొదటిసారి తల్లి కాబోయే వయసు మునుపటికన్నాపెరుగుతోంది. చదువు, కెరీర్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఒక కారణమైతే, మరో కారణం ఆధునిక వైద్యం.. వయసు మీరిన మహిళలకు కూడా సంతానావకాశాలను కలుగజేస్తోంది.

కొంత వయసు దాటాక స్త్రీలు బిడ్డలను కనడం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 35- 40 సంవత్సరాలు దాటిన మహిళలు గర్భం దాల్చినపుడు.. తల్లి, బిడ్డా ఇద్దరూ అనారోగ్య సమస్యల బారినపడే అవకాశముంది. గర్భం దాల్చబోయే ముందు, గర్భంతో ఉన్నపుడు, కాన్పు సమయంలో.. ఇలా ప్రతి దశలోనూ సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా, వయసు పెరిగే కొద్దీ సంతానం కలిగే అవకాశాలు తగ్గుతుంటాయి. కనుక, కృతిమ పద్ధతుల వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే, కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భం దాల్చినప్పుడు స్త్రీలలో వచ్చే ఆరోగ్య సమస్యలతో పోలిస్తే, వయసు మీరిన మహిళలలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయి.

సంతానం కలగడానికి అండాశయాలను ఉత్తేజితపరిచే మందులు వాడవలసి వస్తుంది. ఆ క్రమంలో ‘ఓవరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోం’ అనే ఒక పరిస్థితి ఎదురవుతుంది. అండం విడుదల కోసం ఉపయోగించే శక్తివంతమైన హార్మోన్ల ఫలితంగా అండాశయాలు వాచిపోతాయి. పొట్టలో నీరు చేరుతుంది. దాదాపు 30 శాతం మహిళలలో ఈ సైడ్ ఎఫెక్ట్ తేలిక స్థాయిలో వుంటుంది కానీ, 70 శాతం మంది స్త్రీలలో తీవ్రస్థాయికి చేరుకుని, శరీరంలోని మిగిలిన వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు అండం గర్భాశయంలో ఏర్పడకుండా, పక్కనే వున్న ఫేలోపియన్ ట్యూబులో ఏర్పడుతుంది. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ అంటారు. అలా ట్యూబులో గర్భం వచ్చినపుడు, అక్కడ ఇమడలేక, పగిలిపోయి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీయవచ్చు. ఇలా జరిగే అవకాశాలు వయసు మీరిన స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువని పరిశోధనలు తెలుపుతున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి