‘ఇది పిచ్చితనం’. ‘నేను నమ్మలేకపోతున్నాను’. ‘చాలా విచిత్రమైన నిర్ణయం’.. భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఎందుకిలా జరుగుతోంది?

ఈ వ్యాఖ్యలు ప్రపంచంలోని మాజీ క్రికెటర్లు చేసినవి. వీరు ఇలా కామెంట్ చేయడానికి సరైన కారణం కూడా ఉంది. ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అయినా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల మ్యాచ్ తుది జట్టు 11 మందిలో చోటు దక్కలేదు. 34 ఏళ్ల అశ్విన్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో 413 వికెట్లు తీశాడు. చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఆయన కంటే 14 మంది ఆటగాళ్లు మాత్రమే అధికంగా టెస్ట్ వికెట్లు తీశారు. ఇంతమంచి రికార్డు ఉన్నా, ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌లలో కనీసం ఒక్కదానిలో కూడా ఆడే అవకాశం లభించలేదు. ఆరునెలల కిందట స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ 3-1తో గెలుచుకుంది. ఈ సిరీస్ లో 14.71 సగటుతో 32 వికెట్లు తీసుకుని భారత్ విజయంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.

అశ్విన్‌కు అవకాశం ఇవ్వకూడదనే నిర్ణయంతో “నేను షాక్ అయ్యాను” అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ పేర్కొన్నారు. ”అశ్విన్ ని నాలుగు టెస్టుల్లో తుది జట్టులో ఆడించకపోవడం అనేది, యూకేలో ఇప్పటి వరకు జరిగిన మిగతా టెస్ట్ మ్యాచ్ లలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన చూడలేదు. టెస్ట్ మ్యాచ్‌లలో 413 వికెట్లు తీసి, 5 సెంచరీలు కూడా చేసిన ఆటగాడిని ఎంపిక చేయకపోవడం పిచ్చితనంలాంటిది” అని మైఖేల్ వాన్ ట్విటర్ లో పేర్కొన్నారు. “నేను నమ్మలేకపోతున్నాను. మీరు ప్రపంచ నంబర్ టూ బౌలర్‌ని నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో హాఫ్ ప్యాంటు, టీ కప్పుతో ఎలా కూర్చోబెడతారు?” అని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఫిల్ టుఫ్నెల్ పేర్కొన్నారు.

నాలుగింటిలో ఏదో ఒక టెస్ట్ మ్యాచ్ లోనైనా ఆయన్ని ఆడించొచ్చు. “ఓవల్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. రవిచంద్రన్ అశ్విన్ ని ఇందులో ఏదో ఒక విధంగా ఆడించాల్సింది” అని భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా తెలిపారు. ఎక్స్ ఫ్యాక్టర్ అయ్యే సమర్ధత అశ్విన్ కు ఉందని ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ మార్క్ రాంప్రకాష్ అన్నారు. అశ్విన్ ని ఎంపిక చేయకపోవడం విచిత్రమైన నిర్ణయంగా ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ ఎబోనీ రెన్‌ఫోర్డ్-బ్రెంట్ అభివర్ణించారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని తెలిపారు. మైఖేల్ వాన్ ట్వీట్‌కు ప్రతిస్పందనగా, మార్క్ వా కామెంట్ చేశారు. ”భారతీయ మేధావుల దగ్గర దీనికి ఏదైనా క్లూ ఉంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ”ఇదో అర్థం కాని విషయం” అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించి పోస్ట్ చేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి