ఆంధ్రప్రదేశ్‌లో రైతులు వరి పండించాలంటేనే భయపడిపోతున్నారు. పంట సాగులో అన్నింటికీ ధరలు పెరిగి పోగా, అందుకు భిన్నంగా ధాన్యం ధర తగ్గుతోంది. దీనికి తోడు కొన్న ధాన్యానికి చెల్లింపులు చేయడంలో ఆలస్యం రైతును మరింత ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకుంటున్నామని చెబుతోంది.

”2019లో నేను పండించిన ధాన్యం బస్తా రూ.1400. నిరుడు మొదట రూ.1250 నుంచి చివర్లో అమ్మిన వాళ్లకు రూ.1400 వచ్చింది. అప్పట్లో డీఏపీ రూ. 800 ఉండేది. దమ్ము చేయడానికి ట్రాక్టర్ ఎకరానికి 4 బస్తాలు తీసుకునేవారు. ఇప్పుడు డీఏపీ రూ. 1200 అయ్యింది. ట్రాక్టర్ అద్దె 6 బస్తాలకు పెరిగింది. కానీ ధాన్యం ధర మాత్రం మూడేళ్ల నాటితో పోలిస్తే తగ్గిపోయింది.” అని తూర్పుగోదావరి జిల్లా కరప మండలానికి చెందిన రైతు వీరబాబు అన్నారు.

ఇప్పటికిప్పుడు క్యాష్ అయితే రూ.1150, తర్వాత ఇచ్చేలా అయితే రూ.1200, ఎప్పుడైనా ఇవ్వొచ్చు అనే ఒప్పందం మీద అయితే రూ.1250 వరకు ధర పలుకుతోందని రైతు వీరబాబు చెప్పారు. ఏపీలో అనేక మంది రైతులు ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. రెండు నెలల క్రితమే కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేయడంతో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఆందోళన బాట పట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఈసారి వరి సాగు స్వల్పంగా తగ్గింది. మొత్తంగా వివిధ పంటలు పండించే విస్తీర్ణం పెరిగినప్పటికీ వరి పంట మాత్రం కొంత మేరకు తగ్గింది. అయినప్పటికీ దిగుబడులు పెరగడంతో ధాన్యం నిల్వలకు ఢోకా ఉండడం లేదు. ఏపీలో ఈ సంవత్సరం రబీలో వరి పంట 21.75 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సుమారుగా 65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులను ప్రభుత్వం అంచనా వేసింది. అయితే కరోనా కారణంగా ప్రైవేటు కొనుగోలుదారులకు ఆటంకం ఏర్పడింది.

45 లక్షల మెట్రిక్ టన్నులు తామే సేకరిస్తామని చెప్పిన ప్రభుత్వం అందులో 37లక్షల మెట్రిక్ టన్నుల వరకూ రైతుల నుంచి రావచ్చని లెక్కలు వేసింది. కానీ ఇప్పటి వరకూ ఈ సీజన్ లో 22 లక్షల మెట్రిక్ టన్నుల లోపు మాత్రమే సేకరించగలిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఓ వైపు దిగుబడులు పెరిగాయి. రెండోవైపు కరోనాతో మార్కెట్ ఒడిదుడుకులున్నాయి. అన్నింటి నుంచి గట్టెక్కిస్తామని గట్టిగా చెప్పిన ప్రభుత్వం మాత్రం లక్ష్యాలకు సగం దూరంలోనే సేకరణ చేసింది. ఇవన్నీ కలిసి సామాన్య రైతులకు ఇబ్బందిగా మారాయి. నేటికీ ధాన్యం అమ్ముకోలేక కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమ్ముకున్న వారు బకాయిలు రాక దిక్కులు చూస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి