ములాయం చివరిసారి సీఎంగా ఉండగా 2007లో జరిగిన శాసనసభ ఎన్నికలు, మాయావతి హయాంలో జరిగిన 2012 ఎన్నికలు, అఖిలేశ్‌ సీఎంగా ఉండగా జరిగిన 17వ శాసనసభ ఎన్నికల్లో 2007లో బీఎస్పీకి వచ్చినట్టు ఒకే పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందా? లేక సంకీర్ణమా అనే అంచనాలు పోలింగ్‌కు ముందు వేశారు.

కానీ, వరుసగా మూడు ఎన్నికల్లో మూడు పార్టీలకు సాధారణ మెజారిటీకి అవసరమైన 202 సీట్లు వచ్చాయి. మొదటి సార్వత్రిక ఎన్నికల (1952) తర్వాత 70 సంవత్సరాలకు జరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీజేపీయా? లేక సమాజ్‌వాదీ పార్టీయా? అనే విషయమే చర్చనీయాంశమైంది. హంగ్‌ అసెంబ్లీ ఊసే లేదు, ఎన్నికల ముందు సర్వేలు కూడా త్రిశంకుసభ రాదనే చెబుతున్నాయి.

2014,2019 వరుస లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లలో 60పైనే బీజేపీ గెలిచి గుజరాత్‌ నేత నరేంద్రమోదీ సునాయాసంగా ప్రధాని కాగలిగారు. రెండుసార్లూ కేంద్రంలో కాషాయ కూటమి పీఠమెక్కడానికి యూపీ గెలుపు కీలకమైంది. ఈ రెండు పార్లమెంటు ఎన్నికల మధ్యలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ నాలుగింట మూడొంతులకు పైగా సీట్ల గెలిచి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది. ఇంతటి సుస్థిరత నేపథ్యంలో దేశంలో అతి పెద్దదైన యూపీలో గత ఏడు దశాబ్దాల రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం.

బ్రిటిష్‌వారి కాలంలో యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ ఆఫ్‌ అవుద్‌ అండ్‌ ఆగ్రా (యూపీ) అనే పేరును 1950లో ఉత్తర్‌ ప్రదేశ్‌గా మార్చారు. రాముడు, కృష్ణుడు పుట్టిన నేలగా ప్రజలు నమ్మే ఈ రాష్ట్రం మొత్తం 9 మంది ప్రధానులను అందించింది. కాంగ్రెస్‌కు మొదటి ముగ్గురు ప్రధానులూ యూపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైనవారే.

తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత ఈ పదవి చేపట్టిన లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ, చరణ్‌సింగ్, రాజీవ్‌గాంధీ, వీపీ సింగ్, ఎస్‌.చంద్రశేఖర్, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, నరేంద్రమోదీ యూపీ నుంచి పార్లమెంటుకు ఎన్నికై ప్రధాని పదవిలో కొనసాగారు. ఈ 9 మందిలో నలుగురు కాంగ్రెస్‌ తరఫున, మిగిలిన ఐదుగురు బీజేపీ సహా కాంగ్రెసేతర పక్షాల తరఫున ప్రధానమంత్రి పీఠం అధిష్టించారు. వాస్తవానికి యూపీలో జన్మించిన ప్రధానులు ఎవరంటే-నెహ్రూ, ఇందిర, శాస్త్రి, చరణ్‌సింగ్, వీపీసింగ్, చంద్రశేఖర్‌.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి