“బానిసలకు సంకెళ్లు వేసి లాగడాన్ని నేను టీవీలో చూసినప్పుడు ఆ స్థితిలో నన్ను నేను చూసుకుంటాను” అని చోయ్ కి సున్ (పేరు మార్చాం) చెప్పారు. ఆయన 1953లో కొరియా యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తర కొరియా చేతుల్లో బందీ అయిన 50 వేల మంది ఖైదీలలో ఒకరు.

“మా తల మీద తుపాకి గురి పెట్టి మమ్మల్ని ఆ కార్మికుల క్యాంపులలోకి బలవంతంగా నెట్టేశారు. మా చుట్టూ సాయుధ బలగాలు కాపలాగా ఉండేవారు. ఇది బానిస బతుకు కాకపోతే మరేంటి?” అయన మరో 670 మంది యుద్ధ ఖైదీలతో కలిసి ఉత్తర హాంగ్యోన్గ్ ప్రావిన్స్ దగ్గరలో ఉన్న ఒక గనిలో పని చేసినట్లు చెప్పారు. ఆయన 40 సంవత్సరాల తర్వాత అక్కడ నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఆ గనుల్లో ఏమి జరిగిందో తెలుసుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. చోయ్ వలె బ్రతికి బయట పడిన వారు అక్కడ జరిగిన ప్రమాదకరమైన పేలుళ్లు, మూక ఉరితీతల గురించి చెబుతారు. అతి తక్కువ సరుకులతో అక్కడ ఎలా బ్రతికారో బయట పెడతారు. వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనమని ప్రోత్సహించినప్పటికీ వారి బ్రతుకు కూడా ఆ గనుల్లోకే దారి తీయడం తప్ప మరో మార్గం ఉండదు.

“ఈ గనులున్న ప్రాంతాలలో కొన్ని తరాల ప్రజలు పుట్టి, జీవించి అత్యంత హేయమైన హింసను, వివక్షను జీవితాంతం భరిస్తూ మరణించారు కూడా అని బ్లడ్ కోల్ ఎక్స్పోర్ట్ ఫ్రొం నార్త్ కొరియా నివేదికను తయారు చేసిన వారిలో ఒకరైన జోవానా హోసానియాక్ చెప్పారు. ఆమె సిటిజన్స్ అలియన్స్ ఫర్ నార్త్ కొరియా హ్యూమన్ రైట్స్ (ఎన్ కె ఎచ్ ఆర్)సభ్యులు. దేశంలో బొగ్గు గనుల లోపల నెలకొన్న పరిస్థితుల గురించి ఈ నివేదిక తెలియచేస్తోంది. ఉత్తర కొరియా దేశం బయటకు ఉత్పత్తులను అక్రమ రవాణా చేయడానికి జపాన్ లోని యకుజా లాంటి నేర ముఠాలు కూడా సహకరించి ఆ దేశానికి కొన్ని వందల మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించుకునేందుకు సహాయం చేసిందని ఈ నివేదిక ఆరోపిస్తోంది. అలా సంపాదించిన డబ్బును ఆ దేశ రహస్య అణ్వాయుధ కార్యక్రమానికి వాడినట్లు భావిస్తోంది.

ఉత్తర కొరియా బొగ్గు గనుల గురించి ప్రాధమిక సమాచారం తెలిసిన 15 మంది చెప్పిన వివరాలతో ఈ నివేదికను తయారు చేశారు. అందులో ఒకరితో బీబీసీ మాట్లాడటం మాత్రమే కాకుండా అక్కడ బాధలు పడి పారిపోయినట్లు చెప్పిన మరో నలుగురు స్వతంత్ర వ్యక్తులతో కూడా బీబీసీ మాట్లాడింది. అందులో ఒక్క వ్యక్తి మాత్రం ఆయన వివరాలను బయట పెట్టవద్దని కోరారు. ఆయన కుటుంబ సభ్యులు ఇంకా కొంత మంది ఉత్తర కొరియాలోనే ఉన్నారు. ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న విషయాన్ని ఆ దేశం ఎప్పటికప్పుడు ఖండిస్తూ దానిపై వ్యాఖ్యానం చేయడాన్ని తిరస్కరిస్తూనే వస్తోంది. యుద్ధ ఖైదీలనందరినీ యుద్ధ ఒప్పందంలో భాగంగా వెనుతిరిగి వెళ్లిపోయినట్లు గతంలో ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. అయితే, ఆ దేశంలో ఉండిపోవాలని అనుకున్నవారు అక్కడే ఉండిపోయారని చెప్పారు.

కానీ, అది నిజం కాదని చోయ్ అంటారు. ఆయన సాయుధ దళాల కాపలా మధ్య ఒక కంచెతో కూడిన శిబిరంలో నివసించినట్లు చెప్పారు. ఆయన కష్టపడి పని చేస్తే ఆయనను త్వరగా ఇంటికి పంపిస్తామని చెప్పినప్పటికీ, వారి ఆశ మాత్రం క్రమేణా మరుగున పడిపోయినట్లు చెప్పారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి