మీ అక్వేరియంలోని గోల్డ్‌ఫిష్‌ను పడేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? దగ్గర్లోని చెరువులో దాన్ని వదిలిపెడతారా? లేక బాత్‌రూమ్‌లోని కమోడ్‌లో వేసి నీళ్లు కొట్టేస్తారా?

ఇలా వదిలేయాలని భావిస్తే, ఒక్క నిమిషం ఆగండి. ముందు ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవండి. ఎందుకంటే చెరువులు, నదుల్లోని ఇతర జలచరాలకు ఈ గోల్డ్‌ఫిష్‌లు పెద్ద ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని పరిసరాల్లోని నదులు, చెరువుల్లో వదిలి పెట్టొద్దని అధికారులు హెచ్చరికలు కూడా జారీచేస్తున్నారు.

బంగారు వర్ణంలో మెరిసే ఈ చేపని గోల్డ్‌ఫిష్ అంటారు. దీని శాస్త్రీయ నామం కైరేసియస్ అరాటస్. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని నదులు, చెరువులు సహా జలాశయాల్లోని జీవులకు ఈ గోల్డ్‌ఫిష్‌లు ముప్పుగా పరిణమిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అక్వేరియంలో చూడటానికి ఈ చేపలు చిన్నగానే ఉంటాయి. అయితే, బయట వదిలిపెడితే, ఇవి సాకర్ బాల్ అంత పెద్దగా అవుతాయి. దాదాపు రెండు కేజీల వరకు బరువు పెరుగుతాయి.

భారీగా అయిన తర్వాత ఈ గోల్డ్‌ఫిష్‌లు జలాశయాల్లోని ఇతర చేపలపై దాడులు చేస్తాయి. అక్కడి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఈ చేపలను చెరువులు, నదుల్లో వదిలిపెట్టొద్దని అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో అధికారులు ప్రజలకు సూచించారు. ఫ్లోరిడాలోని బనానా లేక్‌లో భారీ గోల్డ్‌ఫిష్‌ను అధికారులు మొదట గుర్తించారు. అనంతర పరిశీలనలో అక్కడి చేపలపై ఈ గోల్డ్‌ఫిష్‌లు దాడిచేస్తున్నట్లు తేలింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి