ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయిగానీ, పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు.

ఈ సమావేశంలో మాట్లాడిన దిల్లీ ఆర్థిక మంత్రి, పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఇది సమయంకాదని, ఇది రాష్ట్రాల ఆదాయంపై ప్రభుత్వం చూపుతుందని అన్నారు. మరోవైపు, మహారాష్ట్ర, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించాయి. రెండు రాష్ట్రాల నుంచి ఈ ప్రకటన వెలువడిన రోజే జీఎస్టీ సమావేశం జరిగింది.

”కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మీకు ఎలాంటి సమాచారం రాలేదు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 30-32 వేల కోట్ల జీఎస్టీ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం తాను విధించే పన్నును తగ్గించుకోవచ్చు” అని మహారాష్ట్ర ఆర్ధిక మంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర తర్వాత కేరళ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించింది. ”పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే నిర్ణయం తీసుకుంటే మేం దాన్ని వ్యతిరేకిస్తాం” అని కేరళ ఆర్థిక మంత్రి ఎన్. బాలగోపాల్ పీటీఐతో అన్నారు. దేశంలో జీఎస్టీ వ్యవస్థ జూలై 1, 2017 నుండి అమలులోకి వచ్చింది. ఆ సమయంలో అయిదు రకాల పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించారు. వీటిని కూడా చేరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల మీద ప్రభావం పడుతుందని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది.

ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీయేతర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జూలైలో దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ”2014-15 నుండి పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను సేకరణ ద్వారా సేకరించిన మొత్తంలో 370 శాతం పెరుగుదల ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం 3.71 లక్షల కోట్లు సంపాదించింది” అన్నారు మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని అంగీకరిస్తోంది. ఇంత ఆదాయ సంపాదించారు కాబట్టి పన్నులను తగ్గించాలని రాష్ట్రాలు వాదిస్తున్నాయి.

తాజాగా పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇదే జరిగితే, సాధారణ ప్రజానీకం ఎంతో ప్రయోజనం పొందుతారు. దానివల్ల వాటి ధరలు 25 నుంచి 30 శాతం వరకు తగ్గవచ్చు. వాస్తవానికి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ ఏడాది జూన్‌లో కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే జీఎస్టీ కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి