ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ చదువుకున్నవారే కంప్యూటర్లపై పనిచేయగలిగేవారు.

ఇప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ చేరువైంది. దీనివల్ల మంచితో పాటు చెడూ జరుగుతోంది. ధ్రువీకరించుకోని, తప్పుడు వార్తలెన్నో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ‘కంప్యూటర్లకు అత్యంత అనువైన భాష సంస్కృతం’ అలాంటి తప్పుడు వార్తల్లో ఒకటి. ఇది తరచూ కనిపిస్తుంటుంది. కానీ, సంస్కృతం ఎందుకు కంప్యూటర్లకు అనువైనది? కోడింగ్, ప్రోగ్రామింగ్‌లో ఎక్కడైనా సంస్కృతం ఉపయోగించిన దాఖలాలున్నాయా అనేది మాత్రం ఎవరూ ఆధారాలు చూపించరు. కంప్యూటర్ భాషలలో కోడింగ్ ద్వారా మాత్రమే సాఫ్ట్‌వేర్‌లు తయారుచేస్తారని తెలిసినా కోడింగ్‌కు, కంప్యూటర్‌పై పనిచేయడానికి సంస్కృతం అత్యంత అనువైన భాష అంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కనిపిస్తుంటాయి.

సంస్కృత భాషలో కోడింగ్ ఎలా చేయొచ్చనేది కానీ.. లేదంటే సంస్కృతం కోడింగ్‌తో సృష్టించిన సాఫ్ట్‌వేర్ కానీ లేవు. కంప్యూటర్ భాషల్లో మాత్రమే కోడింగ్‌కు అవకాశం ఉండడమే దీనికి కారణం.

ఈ అపోహ ఎక్కడ మొదలైంది?
ఇంటర్నెట్, కంప్యూటర్లు ప్రపంచమంతా విస్తరించడానికి కారణమైన ‘వరల్డ్‌వైడ్ వెబ్'(www) ఆవిష్కరించడానికి ముందే ఈ అపోహకు బీజం పడింది. 1985లో రిక్ బ్రిగ్స్ అనే పరిశోధకుడు ‘ఏఐ’ మేగజీన్‌లో ఒక పరిశోధన పత్రం సమర్పించారు. ‘నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇన్ సాంస్క్రిట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ పేరుతో ప్రచురించిన పరిశోధన పత్రంలో పేర్కొన్న అంశాలకు తప్పుడు భాష్యాలే ఈ అపోహకు మూలం. కంప్యూటర్లతో వ్యవహరించడానికి సహజ భాషలను ఉపయోగించడం అనే అంశాన్ని ఈ పరిశోధన పత్రం చర్చించింది.

”కంప్యూటర్లకు ఆలోచనలను అందించడంలో మెషీన్ భాషల్లో ఉన్నంత గణిత కచ్చితత్వం సహజ భాషల్లో ఉండదన్నది చాలామంది నమ్మకం. కానీ, సంస్కృతం అనే ఒక భాష సుమారు వెయ్యేళ్ల పాటు వాడుక భాషగా ఉంది. ఆ భాషలో సాహిత్యమూ ఉంది” అని రిక్ బ్రిగ్స్ తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.

సెర్చ్ ఇంజిన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ముందు..
కంప్యూటర్లలో ఇన్‌పుట్ భాషగా సహజ భాషలను వాడే అవకాశాలపై చర్చిస్తూ రిక్ బ్రిగ్స్ రాసిన ఈ వ్యాసం సెర్చ్ ఇంజన్ల రాకకు దశాబ్ద కాలం ముందుది. ఉదాహరణకు.. యూజర్ ”భారత ప్రధాన మంత్రి పేరేమిటి” అని అడుగుతూ ఏదైనా ఒక సహజ భాషలో కంప్యూటరుకు ఇన్‌పుట్ ఇస్తే దాన్ని కంప్యూటరు అర్థం చేసుకుని అవుట్‌పుట్ (జవాబు) కూడా అదే భాషలో ఇవ్వగలగాలి. సాధారణంగా మెషీన్ లాంగ్వేజ్‌లో అభివృద్ధి చేసిన కోడింగ్ కంప్యూటరు నుంచి యూజర్ ఏం కోరుకుంటున్నాడనేది ఆ కంప్యూటరుకు అర్థమయ్యేలా చేస్తుంది. ఆ కోడింగ్ కంప్యూటర్ భాషలోనే రూపొందిస్తారు.

సుదీర్ఘ కాలం మనుగడ సాగించిన, పుష్కలమైన సాహిత్యం ఉన్న భాషల్లో సంస్కృతం కూడా ఒకటి అని రిక్ బ్రిగ్స్ తన పరిశోధన పత్రంలో ప్రస్తావించారే కానీ కేవలం సంస్కృతం మాత్రమే అలాంటి భాష అని ఆయనెక్కడా రాయలేదు. కానీ, ఫేక్‌న్యూస్ గుప్పించడం కోసం చాలామంది ఈ పరిశోధనా పత్రానికి వక్రభాష్యం చెబుతూ వాడుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తూ మనుషులతో సహజ భాషల్లో మాట్లాడే రోబోలు రాకముందు.. సహజ భాషల్లో అడిగే ప్రశ్నలకు సహజ భాషల్లోనే సమాధానం వెతికి చెప్పే సెర్చ్ ఇంజన్లు రాకముందు కాలం నాటి పరిశోధన పత్రం ఇది.

ఉదాహరణకు.. ఒక యూజర్ ‘నేపాల్ రాజధాని ఏది?’, ‘నేపాల్ రాజధాని’, ‘రాజధాని నేపాల్’.. ఇలా వాక్యనిర్మాణంతో సంబంధం లేకుండా ఏ భాషలోనైనా సెర్చ్ ఇంజన్‌‌కు ఇన్‌పుట్ ఇస్తే అది నేపాల్ రాజధాని కఠ్‌మాండూకు సంబంధించిన ఫలితాలే చూపిస్తుంది. ఇక్కడ వాక్య నిర్మాణం, పదాల అర్థం అంత పెద్ద విషయం కాదు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి