గత కొద్ది నెలలుగా భారతదేశంలో కోవిడ్ 19 కేసులు బాగా తగ్గిపోయాయని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో, మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడం కలవరపెడుతోంది. తాజా పరిస్థితులపై బీబీసీ ప్రతినిధులు వికాస్ పాండే, సౌతిక్ బిశ్వాస్ అందిస్తున్న కథనం.

మహరాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఒక్కసారిగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయని అక్కడి డాక్టర్లు గమనించారు. ముంబయికి సుమారు 700 కిమీ దూరంలో ఉన్న ఈ జిల్లాలో గత ఏడాది వేసవిలో కరోనావైరస్ విజృంభణ తరువాత పరిస్థితి చాలావరకు సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐసీయూలో 1,600 పడకలున్న ప్రభుత్వ ఆసుపత్రి, అర డజను ప్రైవేట్ ఆసుపత్రులు కూడా దాదాపు ఖాళీ అయిపోయాయి. “కానీ, ఫిబ్రవరిలో అంతా తారుమారైపోయింది. మళ్లీ ఈ జిల్లాలో అందరికీ కరోనా భయం పట్టుకుంది” అని స్థానిక జర్నలిస్ట్ అనిల్ యాదవ్ తెలిపారు. ఫిబ్రవరి మొదలు, అమరావతి జిల్లాలో 10,000లకు పైగా కేసులు నమోదయ్యాయి. 66 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఈ వారంలో 1,000 మందికి పైగా కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. కేసులు పెరుగుతున్న రేటు భయం గొల్పుతోంది. దీంతో మహరాష్ట్రలో అమరావతి జిల్లాతో పాటూ మరి కొన్ని జిల్లాలు మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. 25 లక్షల జనాభా ఉన్న అమరావతి జిల్లాలో ఇరుకుగా ఉండే పట్టణ ప్రాంతాలన్నీ కోవిడ్ హాట్‌స్పాట్లుగా మారిపోయానని స్థానికులు అంటున్నారు.

“అకస్మాత్తుగా కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలియట్లేదు. కుటుంబం మొత్తం వ్యాధి బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇది పూర్తిగా కొత్త ట్రెండ్” అని జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ శ్యామసుందర్ నికం చెప్పారు. ఆ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం నాడు మహరాష్ట్రలో 9,000 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల్లో నమోదైన అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య ఇదే. అదే రోజు 80 కోవిడ్ మరణాలు సంభవించాయి.

“ఇక్కడ ఎవరూ మాస్కులు పెట్టుకోవట్లేదు. పెళ్లిళ్లకు, స్థానిక ఎన్నికల ప్రచారాలకు గుంపులుగుంపులుగా వెళ్తున్నారు. అందరూ మామూలుగా తిరిగేస్తున్నారు. ఎవరూ భౌతిక దూరం పాటించట్లేదు. కరోనా టెస్టులు సంఖ్య తగ్గింది. ట్రాకింగ్ కూడా తగ్గిపోయింది. అందుకే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది” అని మహరాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు డాక్టర్ సంజయ్ ఓక్ అంటున్నారు. ఒక్క మహరాష్ట్రలోనే కాకుండా కేరళ, కర్నాటక, తెలంగాణ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో కోవిడ్ కేసులు చాలావరకు తగ్గు ముఖం పట్టాయి. సెప్టెంబర్‌లో రోజువారీ పాజిటివ్ కేసులు 90,000 ఉన్నవి.. ఇప్పుడు 20,000లకి తగ్గాయి. ఇలాంటి సమయంలో మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అంటువ్యాధి నిపుణులకు, శాస్త్రవేత్తలకు కూడా ఈ పరిస్థితి కలవరం కలిగిస్తోంది.

ఈ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరగడానికి సాధారణంగా కనిపిస్తున్న కారణాలు.. పెద్దసంఖ్యలో జనం హాజరవుతున్న పెళ్లిళ్లు, మాస్కులు వేసుకోకపోవడం, సినిమా హాళ్లు, జిమ్, స్విమ్మింగ్ పూల్స్ తెరవడం, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాలు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి