పశ్చిమ బెంగాల్‌లో తగిలిన ఎదురుదెబ్బకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలో చాణక్యుడిగా పేరు పొందిన హోం మంత్రి అమిత్ షా విచారిస్తూ కూర్చున్నారా? లేక అసోంలో గెలిచామని ఊరట చెందుతున్నారా?

బెంగాల్‌లో మమతా బెనర్జీ శిబిరంలో, కేరళలో ఎల్‌డీఎఫ్, తమిళనాడులో డీఎంకే శిబిరాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. బెంగాల్‌లో బీజేపీ ప్రచారం చేసిన విధానం ఆ పార్టీ మద్దతుదారుల్లో విజయం ఖాయమనే నమ్మకాన్ని పెంచింది. కానీ, ఎన్నికల ఫలితాలు వారి అంచనాలకు విరుద్ధంగా రావడంతో బీజేపీ పెద్దలంతా విచారంలో మునిగి ఉండొచ్చు. కానీ, మరో కోణం నుంచి చూస్తే, 2016 ఎన్నికలతో పోలిస్తే బెంగాల్‌లో బీజేపీ సత్తా మూడు సీట్ల నుంచి 77 సీట్లకు పెరగడం ఆ పార్టీకి గర్వకారణం కావొచ్చు.

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు కొన్ని విషయాలను స్పష్టం చేస్తున్నాయి. బెంగాల్ ఫలితాలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న “ఫైటర్” ఇమేజ్‌ను బలోపేతం చేశాయి. ఆమె, తన రాజకీయ జీవితంలో ఎదురైన అతి పెద్ద సవాలును అధిగమించి బలంగా నిలబడగలిగారు. తన సహచరులు కొందరు పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరారు గానీ ఓటర్లు ఆమెను విడిచిపెట్టలేదు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి 2011లో, 2016లో 44 శాతం ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎదురు దెబ్బ తగిలి, లోక్‌సభలో సీట్లు తగ్గినప్పటికీ ఆ ఎన్నికల్లో టీఎంసీ ఓట్ల శాతం తగ్గలేదు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల ఫలితాలు చూసినా కూడా టీఎంసీ మద్దతుదారుల్లో మమతా బెనర్జీపై ఉన్న విశ్వాసం తగ్గలేదని స్పష్టమవుతోంది.

టీఎంసీ ఘన విజయాన్ని పురస్కరించుకుని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మాయావతి, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వంటివారు మమతా దీదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక ర్యాలీల్లో ప్రధాని మోదీ… మమతా బెనర్జీని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. “దీదీ ఓ దీదీ… బెంగాల్ ప్రజలు మీ మీద ఎంత భరోసా ఉంచారో” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి