మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఈసారి కూడా ఫేవరెట్లలో ఒకటిగా టీమిండియా ఈ టోర్నీలో దిగుతుంది. అయితే ఈ టోర్నీలో కూడా టీమిండియాను ఇక ప్రధాన సమస్య ఇబ్బంది పెడుతోంది. అదే నెంబర్ 4 బ్యాటర్ సమస్య.

గత వరల్డ్ కప్‌లో కూడా ఈ స్థానంలో ఆడే బ్యాటర్ సమస్య టీమిండియాను తెగ ఇబ్బంది పెట్టింది. దీని గురించి తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడాడు. ఎవరూ ఊహించని సలహా ఇచ్చాడు. టీమిండియా నెంబర్ ఫోర్ సమస్య తీర్చే సత్తా ఒక్కడికే ఉందన్నాడు.

ప్రస్తుతం టీమిండియాలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని నాలుగో నెంబర్‌లో ఆడించాలని రవిశాస్త్రి చెప్పాడు. తాను టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడే ఈ సజెషన్ ఇచ్చానని, కానీ ఆ సమయంలో అమలు కాలేదని గుర్తుచేసుకున్నాడు.

ఇలా కోహ్లీని ఒక స్థానం కిందకు దింపడం వల్ల మిడిలార్డర్ బలం పెరుగుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘టీమిండియా కోసం నాలుగో నెంబర్‌లో ఆడటానికి విరాట్ కోహ్లీ ఎప్పుడూ రెడీనే. గత రెండు వరల్డ్ కప్‌లలో కూడా ఇదే సలహా ఇచ్చా. నేను కోచ్‌గా ఉన్నప్పుడు కూడా దీని గురించి చర్చించా’ అని చెప్పుకొచ్చాడు.

టీమిండియా టాపార్డర్ చాలా బలంగా ఉందని, కానీ మిడిలార్డర్‌ ఆశించినంత బలంగా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ సమస్యకు చెక్ పెట్టాలన్నా కూడా కోహ్లీని నాలుగో స్థానంలో పంపడమే బెటర్ అని శాస్త్రి అన్నాడు. అందుకే 2019 వరల్డ్ కప్‌లో ధోనీ, కోహ్లీతో ఈ విషయం చర్చించాలని అనుకున్నట్లు చెప్పాడు.