Home News ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?

ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?

17
0

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనను వివిధ పార్టీల నాయకులు ఖండించారు. సంఘటనా స్థలానికి వెళ్లేందుకు పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం వారిని అడ్డుకుంటోంది.

ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ వాద్రాతో సహా పలువురు కాంగ్రెస్ నేతలను సీతాపూర్‌లో అడ్డుకొని, అదుపులోకి తీసుకొన్నారు. “రైతులను అణగదొక్కుతున్న విధానం చూస్తుంటే మాటలు రావట్లేదు. తమకు అన్యాయం జరుగుతోందని ఎన్నో నెలలుగా రైతులు గొంతెత్తి చెబుతున్నారు. కానీ, వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, రైతులను అణచివేసే, నాశనం చేసే దిశలో ప్రభుత్వం రాజకీయలు చేస్తోందని స్పష్టం అవుతోంది” అంటూ ప్రియాంకా గాంధీ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

“ఈ దేశం రైతులది. బిజేపీ సొత్తేం కాదు. దీన్ని రైతులు సాగుచేశారు. బలాన్ని ఉపయోగిస్తున్నారంటే పోలీసులు తమ నైతికతను కోల్పోయారనే అర్థం. తప్పు చేయడానికి నా ఇల్లు కదిలి రాలేదు. బాధితులను పరామర్శించడానికి వెళుతున్నాను. వారి కన్నీరు తుడవడానికి వెళుతున్నాను. నేనేం తప్పు చేశాను? నేను నిజంగా తప్పు చేసుంటే మీ దగ్గర ఆదేశాలు ఉండాలి. వారెంట్ ఉండాలి. మీరు కారును ఆపుతున్నారు. నన్ను అడ్డుకొంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేను సీఎంను పిలుస్తుంటే ఆయన దాక్కొంటున్నారు. చేస్తున్న పని సరైనదే అయితే దాక్కోవడం ఎందుకు?” అని ఆమె ఆ వీడియోలో ప్రశ్నించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేసారు. అందులో ప్రియాంకా గాంధీ, హరియాణా కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హూడా పోలీసులతో గొడవపడుతూ కనిపించారు. “నాకు ఆధారాలు చూపించండి. ఆర్డర్ చూపించండి. వారెంట్ చూపించండి. అవేమీ లేనట్లయితే మమ్మల్ని ఆపే హక్కు మీకు లేదు. మేం నలుగురం ఉన్నాం. ఏమనుకుంటున్నారు? ప్రజలను చంపగలరు, రైతులను అణగదొక్కగలరు కాబట్టి మమ్మల్నీ ఆపగలరు అనుకుంటున్నారా?” అంటూ ప్రియాంక ఆ వీడియోలో కోపంగా ప్రశ్నిస్తూ కనిపించారు.

ప్రియాంకా గాంధీ ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం లేదా ప్రభుత్వాన్ని ఇంత బలంగా వ్యతిరేకించడం ఇదేం మొదటిసారి కాదు.