భారత్‌లో వరుసగా నాలుగో రోజు 3 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 3,49,691 పాజిటివ్ కేసులు నమోదవగా2,767 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలతో రాజధాని దిల్లీ కూడా ఒకటి. ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రజలంతా తీవ్ర నిరాశనిస్పృహలో కూరుకుపోయారు. అశ్విన్ మిత్తల్ బామ్మ కరోనావైరస్ బారినపడడంతో ఆమె శరీరంలో ఆక్సిజన్ స్థాయి గతవారం పడిపోయింది. అప్పటి నుంచి అశ్విన్ ఆసుపత్రి బెడ్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్ని ఆసుపత్రులకు ఫోన్ చేసినా ఎక్కడా బెడ్ దొరకలేదు. గురువారం సరికి ఆమె పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో ఆమెను తీసుకుని ఆసుపత్రులన్నీ తిరిగారు అశ్విన్. అన్ని ఆసుపత్రులలోనూ ఎమర్జెన్సీ రూములన్నీనిండిపోయి ఉన్నాయి. ఎక్కడా చేర్చుకోలేదు. చికిత్స దొరక్కపోతే ఆమె చనిపోతారనీ చెప్పేశారు.

చాలా ఆసుపత్రులు తిరిగిన తరువాత అశ్విన్ బామ్మకు ఉత్తర దిల్లీలోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు. అది కూడా కొద్దిగంటలే ఉంచగలమని వారు చెప్పారు. దాంతో అశ్విన్ మళ్లీ హాస్పిటల్ బెడ్స్ కోసం తన ప్రయత్నాలు ప్రారంభించారు. అశ్విన్ కూడా కరోనా పాజిటివ్.. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులతోనే ఆయన ఆసుపత్రులన్నీ తిరిగారు. కానీ, ఎక్కడా బెడ్ దొరకలేదు. చివరకు అశ్విన్ బామ్మను ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్న ఆసుపత్రి ఆమెకు అక్కడే చికిత్స కొనసాగించింది. అయితే, ఆమెను ఐసీయూలో చేర్చాలని.. లేకపోతే బతకడం కష్టమని అక్కడి వైద్యులు చెప్పారు. ఆ ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ నిల్వలు అయిపోతున్నాయని.. అందుకే వారు ఆమెను డిశ్చార్జ్ చేయాలని చూస్తున్నారని అశ్విన్‌కు ఆయన కుటుంబ స్నేహితులు చెప్పారు. దిల్లీలోని చాలా ఆసుపత్రులలో ఇదే పరిస్థితి. ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఒకటీరెండు బెడ్‌లు ఖాళీగా ఉన్న ఆసుపత్రులు కూడా ఆక్సిజన్ సరఫరా లేక కొత్తగా రోగులను చేర్చుకోవడం లేదు. కొందరికి బెడ్‌లు దొరికినా కూడా ఆక్సిజన్ సదుపాయం ఉన్న అంబులెన్స్‌లు దొరకడం లేదు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి